- రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఉద్యోగుల డిమాండ్
- పోలీసుల వేధింపులపై డీజీపీ, మంత్రులను కలవాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో ఉన్న అధికారులపై నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ డిమాండ్ చేసింది. ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని పేర్కొంది. గడిచిన 20 ఏండ్లలో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ప్రభుత్వానికి వచ్చే రాబడి భారీగా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచకపోవడంతో పనిభారం మోయలేని స్థాయికి చేరిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే పని ఒత్తిడి తగ్గించేలా శాఖను పునర్వ్యవస్థీకరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. హైదరాబాద్‌లోని కేశవ్ మెమోరియల్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఉద్యోగుల రాష్ట్రస్థాయి అత్యవసర సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. శాఖలోని మొత్తం 900 మంది ఉద్యోగులకు గాను దాదాపు 800 అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కన్వీనర్ హరికోట్ల రవి, ప్రధాన కార్యదర్శి సిరాజ్ అన్వర్ పాల్గొన్నారు.
అధికారిక విధులు నిర్వర్తించే సబ్ రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నా, అదుపులోకి తీసుకోవాలన్నా శాఖాధిపతి (సీఅండ్ఐజీ) ముందస్తు అనుమతి తప్పనిసని అని గతంలో కమిషనర్, డీజీపీ జారీ చేసిన మార్గదర్శకాలను పోలీసులు తుంగలో తొక్కుతున్నారని అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఉద్యోగుల సమస్యలు, అక్రమ అరెస్టుల నివారణపై త్వరలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు.
పోలీసుల వేధింపులను అడ్డుకునేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల సీపీలు, ఎస్పీలకు జిల్లా అధికారుల బృందం ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిపై కేసులు బనాయించకుండా స్పష్టమైన సర్క్యులర్ జారీ చేయాలని కోరుతూ డీజీపీని సైతం త్వరలో కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
పోస్టులు నింపండి...
ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పనిసరిగా ఒక సీనియర్ అసిస్టెంట్ పోస్టును, ప్రతి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ కేడర్ సూపరింటెండెంట్ పోస్టును వెంటనేఏ మంజూరు చేయాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. పదోన్నతుల విస్తృతి కోసం సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టును మల్టీ-జోన్ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు శాఖలోని అన్ని కేడర్ల ఖాళీల భర్తీ, ప్రమోషన్ల ప్యానెల్స్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.
విలువైన దస్త్రాలు, ప్రభుత్వ రికార్డులు ఉండే ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి శాశ్వత ప్రాతిపదికన సెక్యూరిటీ లేదా గేట్ కీపర్ సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న యూజర్ చార్జీల నిధులను నేరుగా కార్యాలయాల రోజువారీ నిర్వహణకు, స్టేషనరీ, కనీస మౌలిక వసతుల కల్పనకు పారదర్శకంగా కేటాయించాలన్నారు.
ఇక్కడా ఓపీఎస్ అమలు చేయాలి: సీపీఎస్ఈయూ
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు దిశగా అడుగులు వేస్తున్నందున, తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని 2.68 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల భవిష్యత్తును కాపాడేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
